High Court: పార్టీ జెండాల రూపురేఖలపై ఈసీకి నోటీసులు పంపిన ఢిల్లీ హైకోర్టు

  • కొన్ని పార్టీల జెండాలు మతపరమైన ప్రభావం కలిగించేలా ఉన్నాయంటూ పిటిషన్
  • విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు
  • కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు

కొన్ని పార్టీల జెండాలు మతపరమైన అభిప్రాయాలు కలిగించే విధంగా ఉన్నాయని, జాతీయ పతాకాన్ని పోలి ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. మతపరమైన పేర్లు, భావాలు, చిహ్నాలతో కూడిన పార్టీల జెండాలు, త్రివర్ణ పతాకాన్ని పోలిన పార్టీల జెండాలు ఎన్నికల్లో అభ్యర్థుల అవకాశాలపై ప్రభావం చూపుతాయని, దీనిపై ఈసీ చర్యలు తీసుకుని అలాంటి పార్టీల రిజిస్ట్రేషన్ తొలగించాలని బీజేపీ నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

హిందూ సేన, ఎంఐఎం తదితర పార్టీలు అందుకు ఉదాహరణ అని, జాతీయ జెండాకు దగ్గరగా ఉన్న పార్టీ జెండాను కాంగ్రెస్ ఉపయోగిస్తోందని ఉపాధ్యాయ్ తన పిటిషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి పార్టీలకు మూడు నెలల సమయం ఇవ్వాలని, అప్పటికీ తమ జెండాల్లో మార్పులు చేయకపోతే వాటి రిజిస్ట్రేషన్ ను రద్దుచేయాలని కోరారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ ఏజే భంభానీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తదుపరి విచారణను జూలై 17కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News