YSRCP: నర్సీపట్నంలో ఏపీ మంత్రిని ఓడించిన పూరీ జగన్నాథ్ సోదరుడు
- నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి పరాజయం
- విజయం సాధించిన మెట్ల ఉమాశంకర్ గణేశ్
- గత ఎన్నికల్లో ఓటమిపాలైన వైనం
ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా సాగిన సంగతి తెలిసిందే. వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టిన వైనం ఎన్నికల ఫలితాల్లో తేటతెల్లమైంది. కాగా, విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర ఫలితం వచ్చింది. ఇక్కడ ఏపీ మంత్రి హోదాలో చింతకాయల అయ్యనపాత్రుడు పోటీచేయగా, ఆయనకు ఊహించని ఓటమి ఎదురైంది. ఆయనపై గెలిచింది ఎవరో కాదు, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు మెట్ల ఉమాశంకర్ గణేశ్.
వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన గణేశ్ కు అయ్యన్నపాత్రుడు ఒకప్పటి రాజకీయ గురువు. కానీ, రాజకీయాలంటే చెప్పేదేముంది? ఎప్పుడు ఎవరు ఎవరికి ప్రత్యర్థులు అవుతారో, మిత్రులు అవుతారో చెప్పలేం! నర్సీపట్నంలో కూడా ఇదే పరిస్థితి! అయితే, ఇక్కడ చివరి రౌండ్ వరకు గణేశ్ ఆధిక్యమే కొనసాగింది. పూరీ సోదరుడికి 90, 077 ఓట్లు పోలవగా, అయ్యనపాత్రుడు 67,777 ఓట్లతో సరిపెట్టుకున్నారు.
ఉమాశంకర్ గణేశ్ మండల స్థాయి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్ నేతను ఓడించగలిగారు. గత ఎన్నికల్లో గణేశ్ స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఈసారి ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుని చిరస్మరణీయ విజయం సాధించారు.