YSRCP: సామాన్యులుగా బరిలోకి దిగారు.. హేమాహేమీలను ఓడించారు!
- పలువురు రాజకీయ అనుభవం లేనివారికి టికెట్లు
- ఉద్దండులను ఓడించిన సామాన్యులు
- వైసీపీ నీడన ప్రజాప్రతినిధులుగా విజయం
వారంతా సామాన్యులు... ఎన్నికలకు ముందు ప్రజలకు పెద్దగా పరిచయం లేని వారు. అయితేనేం? రాజకీయ దిగ్గజాలను ఢీకొట్టి మట్టికరిపించి అసామాన్య విజయాలను అందుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీడన ప్రజా ప్రతినిధులుగా గెలిచారు. అటువంటి వారిలో తలారి రంగయ్య, నందిగం సురేష్, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్ తదితరులెందరో ఉన్నారు.
డీఆర్డీయే లో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసిన తలారి రంగయ్య, వైసీపీలో చేరగా, బీసీలను ఆదరించాలన్న ఉద్దేశంతో ఆయనకు అనంతపురం ఎంపీ స్థానాన్ని జగన్ కేటాయించారు. ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిని రంగయ్య ఓడించారు.
ఇక బాపట్ల లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన నందిగం సురేష్ ఓ సాధారణ వైసీపీ కార్యకర్తగా కొద్ది మందికే పరిచయం. అటువంటి వ్యక్తి, సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రిపై గెలిచారు.
రాజవంశీకుడు, దశాబ్దాల రాజకీయ చరిత్రగల కిశోర్ చంద్రదేవ్ ను అరకులో ఓడించిన గొడ్డేటి మాధవి కూడా, ఎన్నికలకు ముందు వరకూ రాజకీయాల్లో పెద్దగా పేరులేని మహిళే.
గోరంట్ల మాధవ్ విషయానికి వస్తే, జేసీని సవాల్ చేస్తూ, మీసం మెలేసేదాకా, అతనెవరన్న విషయం అనంతపురం జిల్లా పోలీసులకు తప్ప మరెవరికీ తెలియదు. అటువంటి వ్యక్తిని ఏరి కోరి హిందూపురం పార్లమెంట్ కు జగన్ నిలబెట్టగా, సీనియర్ నేత నిమ్మల కిష్టప్పపై విజయం సాధించారు.
వీరితో పాటు ఎచ్చెర్లలో మంత్రి కళా వెంకట్రావును ఓడించిన కొర్లె కిరణ్, ఎస్ కోటలో ఏడు సార్లు గెలిచిన కోళ్ల అప్పలనాయుడిని ఓడించిన కలిదిండి శ్రీనివాస్, కర్నూలు జిల్లా నందికొట్కూరులో గెలిచిన మాజీ పోలీసు ఉద్యోగి ఆర్ధర్, దెందులూరులో చింతమనేనిని ఓడించిన అబ్బయ్య చౌదరి తదితరులు కూడా రాజకీయాలకు కొత్త వారే.