janasena: ‘జనసేన’కు ఓటేసిన ప్రతి ఓటర్ కూ కృతఙ్ఞతలు: పవన్ కల్యాణ్
- జనసేన సైనికులందరికీ ధన్యవాదాలు
- ఒడిదుడుకులను ఎదుర్కొనే సత్తా ఉంది
- అన్నింటికి సిద్ధపడే పార్టీని ఏర్పాటు చేశా
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ మెజార్టీ స్థానాలు సాధించి, ఇంకా కొన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ 23 స్థానాల్లో విజయం సాధించి మరికొన్ని స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అయితే, జనసేన పార్టీ మాత్రం ఇంత వరకూ ఖాతా తెరవలేదు. విశాఖపట్టణంలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటర్ కు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. పార్టీ కోసం పని చేసిన జనసేన సైనికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పాతిక సంవత్సరాల ప్రస్థానం ఉండాలన్న ఉద్దేశంతో పార్టీని స్థాపించామని అన్నారు. అన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కొనే సత్తా ఉందని, అవన్నీ ఆలోచించి, అన్నింటికి సిద్ధపడ్డే పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.