Chiranjeevi: నేను ఆ రోజే చెప్పా.. సినీ ఇండస్ట్రీని చిరంజీవి రూల్ చేస్తాడని!: ఆర్. నారాయణమూర్తి
- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఆడియో విడుదల
- చిరంజీవి రావడం వల్ల కార్యక్రమాన్ని లైవ్ ఇస్తున్నారన్న ‘ఎర్ర’ నటుడు
- చిరంజీవితో నాటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నారాయణమూర్తి
చిరంజీవి తెలుగు సినీ చిత్రపరిశ్రమను ఏలుతాడని తాను ఎప్పుడో చెప్పానని నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన స్వీయనిర్మాణంలో రూపుదిద్దుకున్న ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా ఆడియో ఫంక్షన్‌ను మంగళవారం హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ చిరంజీవిని ఆకాశానికెత్తేశారు. తన సినిమా ఆడియో ఫంక్షన్‌కు చానళ్లు ఎప్పుడూ లైవ్ ఇవ్వలేదని, చిరంజీవి రావడం వల్ల ఇప్పుడు తొలిసారిగా లైవ్ ఇస్తున్నారని అన్నారు. ఆడియో ఫంక్షన్‌కు వస్తే తన సినిమాకు ప్రమోషన్‌లా ఉంటుందని చెప్పగానే చిరంజీవి ఓకే అన్నారని నారాయణమూర్తి పేర్కొన్నారు.
‘ ప్రాణం ఖరీదు’లో చిరంజీవి హీరోగా నటిస్తే తాను జూనియర్ ఆర్టిస్టుగా చేశానని నారాయణమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సినిమా షూటింగ్ కోసం చిరంజీవి, నూతన్ ప్రసాద్, చంద్రమోహన్‌ని రాజమండ్రి అప్సర లాడ్జిలో ఉంచారని, తనకు కూడా అదే లాడ్జీలో రూము ఇస్తారని, మంచి భోజనం దొరుకుతుందని ఆశించానని, అయితే, సీన్ రివర్స్ అయిందని, తనను వంటపాకలో ఉంచారని చెబుతూ నవ్వేశారు.
సినిమా షూటింగ్ సమయంలో ఓ యువకుడు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్‌మెన్‌తో షాట్‌లోకి వచ్చాడని, అతడు ఎవరా అని చూస్తే చిరంజీవి అని నారాయణమూర్తి అన్నారు. అతడిని అలా చూడగానే తెలుగు సినిమా ఇండస్ట్రీని పాలిస్తాడని తనకు అప్పుడే అనిపించిందని చెప్పారు. అదే రోజు ఆయనతో అదే మాట చెబితే.. ‘థ్యాంక్యూ నారాయణ’ అని అన్నారని వివరించారు. చిరంజీవి తన ఆడియో ఫంక్షన్‌కు రావడం తన అదృష్టమని, తనపై ఆయనకున్న అభిమానానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని నారాయణమూర్తి పేర్కొన్నారు.