pslv c46: పీఎస్ఎల్వీ సీ46 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం.. రేపు ఉదయం 5.30 గంటలకు నింగిలోకి!
- తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్
- రీశాట్-2బీ శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టనున్న రాకెట్
- తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో ఛైర్మన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ46ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 25 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది.
రేపు తెల్లవారుజామున 5.27 నిమిషాలకు రాకెట్ ను ప్రయోగించాలని ముందు అనుకున్నా... అంతరిక్షంలో వ్యర్థాలు అడ్డురానుండటాన్ని గుర్తించి, మూడు నిమిషాల ఆలస్యంగా 5.30 గంటలకు ప్రయోగించాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం ద్వారా 615 కిలోల బరువున్న రీశాట్-2బీ శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెడతారు. మరోవైపు, రాకెట్ ప్రయోగం నేపథ్యంలో, ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ప్రయోగం సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.