Nalgonda District: ఇంతటి దుర్మార్గుడని తెలియదు.. వాడిని చంపేయండి: సైకో శ్రీనివాస్‌రెడ్డి తల్లిదండ్రులు

  • శ్రీనివాస్‌రెడ్డి వల్ల మా కుటుంబాలు ఆగమయ్యాయి
  • అతడికి ఎంతటి శిక్ష విధించినా తక్కువే
  • ఉరి కంటే మరేదైనా పెద్ద శిక్ష ఉంటే విధించండి

తమ కుమారుడు, హాజీపూర్ సైకో కిల్లర్ మర్రి శ్రీనివాసరెడ్డిని చంపేయమంటూ అతడి తల్లిదండ్రులు, సోదరుడు కోరుతున్నారు. తమ కుమారుడు అంత దుర్మార్గుడని తమకు తెలియదని, అతడికి ఎంతటి శిక్ష విధించినా తక్కువే అవుతుందని అన్నారు. కాబట్టి అతడిని చంపేయాలని అన్నారు. అతడి వల్ల తాము తలెత్తుకోలేకపోతున్నామని, ఉన్న ఊరును వదిలి ప్రాణభయంతో ఎక్కడెక్కడో తిరుగుతున్నామని అన్నారు. ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

శ్రీనివాస్ రెడ్డి ఇన్ని దుర్మార్గాలకు పాల్పడతాడని తాము అనుకోలేదని అతడి తండ్రి బాల్‌రెడ్డి పేర్కొన్నాడు. అతడి ప్రవర్తనపై తమకు ఎప్పుడూ అనుమానం రాలేదన్నాడు. లిఫ్ట్ మెకానిక్‌గా పలు ప్రాంతాలు తిరిగేవాడని, గతేడాది గృహప్రవేశం సందర్భంగా ఇంటికి వచ్చాడని వివరించాడు.

కుమారుడి కారణంగా తమ బతుకులు ఆగమయ్యాయని అతడి తల్లి కన్నీరు పెట్టుకుంది. వాడిని చంపితేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని, అమ్మాయిల ఆత్మకు శాంతి చేకూరుతుందని పేర్కొంది. వేములవాడకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పలుమార్లు చెప్పాడని, ఆమెతో ఫోన్లో కూడా మాట్లాడించాడని వివరించింది. ఇన్ని ఘాతుకాలకు పాల్పడుతున్నా కుమారుడిపై తమకు ఎప్పుడూ అనుమానం రాలేదని పేర్కొంది.  

అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడి చంపేసిన శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష కంటే మరేదైనా పెద్ద శిక్ష ఉంటే వేయాలని అతడి సోదరుడు కోరాడు. తాము ఏ నేరం చేయలేదని, అతడి వల్ల తమ కుటుంబం మొత్తం బజారున పడిందని పేర్కొన్నాడు. కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లును వాడి వల్ల వదిలేయాల్సి వచ్చిందని, ఇప్పుడు బస్టాండ్లలో తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.

Nalgonda District
Yadadri Bhuvanagiri District
Srinivas reddy
psycho killer
Telangana
Hajipur
  • Loading...

More Telugu News