Telangana: పెద్దమ్మ తల్లీ.. రెండేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోవాలే.. ప్రజల ఉసురు ముట్టాలే!: వి.హనుమంతరావు

  • తెలంగాణలో నియంతృత్వం నడుస్తోంది
  • హాజీపూర్ బాధితులకు న్యాయం చేయాలే
  • మీడియాకు నేను హ్యాట్సాఫ్ చెబుతున్నా
  • గాంధీభవన్ లో మీడియాతో కాంగ్రెస్ నేత

హాజీపూర్ బాధిత కుటుంబాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ బావిలో ధర్నాకు దిగినవారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమయినా ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత కుమారుడు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే కేసీఆర్ పరామర్శించడానికి వెళ్లారనీ, కానీ హాజీపూర్ బాధితులను కలుసుకోవడానికి మాత్రం వెళ్లలేదని దుయ్యబట్టారు. ఈరోజు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు.

‘నీకు మనవడి మీద ప్రేమ ఉంది కానీ మామీద(ప్రజలు)  ప్రేమ లేదా? అని అడుగుతున్న. నీకు నీ మనవడు ఎంత ఇంపార్టెంటో తల్లిదండ్రులకు వాళ్ల పిల్లలు అంత ఇంపార్టెంటు. 26 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోతే పట్టించుకోవు. రేప్ చేసిన శ్రీనివాసరెడ్డిని ఎన్ కౌంటర్ చేయవు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వవు. మీడియాకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలే. రోజూ హాజీపూర్ కు పోతున్నరు.

అక్కడి పరిస్థితులను కవర్ చేస్తున్నరు. తెలంగాణలో నియంత రాజ్యం నడుస్తోంది. పెద్దమ్మతల్లీ.. రెండేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోవాలే. ప్రజల ఉసురు ముట్టాలే’ అని మండిపడ్డారు. హాజీపూర్ బాధితులకు న్యాయం జరిగే వరకూ, అంబేడ్కర్ విగ్రహం పెట్టేవరకూ, 26 మంది ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని వీహెచ్ స్పష్టం చేశారు. ‘కేసీఆర్.. నీకు బాగా నెత్తికెక్కిందిరా బాబు.. ప్రజలు నిన్ను తిప్పితిప్పి కొడతారు’ అని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News