Telugudesam: అసాంఘిక శక్తులు, గూండాలను టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా పంపుతోంది.. జాగ్రత్త!: విజయసాయిరెడ్డి
- 2014లోనూ ఈ 5 చోట్ల రిగ్గింగ్ జరిగింది
- చిత్తూరు కలెక్టర్, రాప్తాడు ఆర్వోలపై ఫిర్యాదు చేశాం
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం గ్రామాల్లో 2014 ఎన్నికల సందర్భంగా ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. ఒక్కఓటు కూడా వేరే పార్టీకి పడలేదనీ, ఇక్కడ రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. తాజాగా ఈ ఐదు గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నపై సత్వరం చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని విజయసాయిరెడ్డి చెప్పారు.
ఢిల్లీలో ఈరోజు వైసీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బుట్టా రేణుక, పండుల రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి ఈసీ ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఆర్వోగా ఉన్న ఓ మహిళా అధికారి మంత్రి పరిటాల సునీతకు తొత్తుగా మారిపోయారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్న సదరు అధికారిణిని కౌంటింగ్ విధుల నుంచి తప్పించాలని ఈసీని కోరామని చెప్పారు. ‘టీడీపీ నేతలు అసాంఘిక శక్తులు, గూండాలకు ట్రైనింగ్ ఇచ్చి కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించడం జరిగింది. ఎక్కడైతే పోలింగ్ ఆపగలరో, ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించగలరో, ఎక్కడ అయితే టీడీపీకి ఓట్లు తక్కువగా వస్తున్నాయో అక్కడ కౌంటింగ్ ను ఆపాలని, అల్లర్లు చేయాలని వీరికి స్పష్టమైన ఆదేశాలు అందాయి.
ఈ విషయాన్ని మేం ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. చివరికి పిల్లలను కూడా కౌంటింగ్ ఏజెంట్ల విధులకు వాడుకోవడం దేశచరిత్రలో ఇదే తొలిసారి’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు పంపుతున్న గూండాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైసీపీ శ్రేణులకు విజయసాయిరెడ్డి సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఏపీ పోలీసులకు అదనంగా కేంద్ర బలగాలను నియమించాలని మరోసారి ఈసీని ఆయన కోరారు. కలెక్టర్ ప్రద్యుమ్న, రాప్తాడు ఆర్వోపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.