KCR: దక్షిణాదిలో బీజేపీకి వచ్చే సీట్లు ఇవే: కేసీఆర్
- 9-10 సీట్లకు మించి రావు
- బీజేపీ 130 సీట్లకే పరిమితం అవుతుంది
- తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్
దక్షిణాదిలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జోస్యం చెప్పారు. ఈసారి కేంద్రంలో ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. దక్షిణాదిలో బీజేపీకి 9-10 సీట్లకు మించి రావని కేసీఆర్ జోస్యం చెప్పారు. దేశంలోని మొత్తం లోక్సభ స్థానాలను బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు సమానంగా పంచుకుంటాయని అన్నారు.
బీజేపీకి 120-130 సీట్లు, కాంగ్రెస్కు 110-120 సీట్లు వస్తాయన్న కేసీఆర్.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో 16 స్థానాలను టీఆర్ఎస్, ఒకటి మిత్రపక్షం గెలుచుకుంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.