Narendra Modi: బాపూని అవమానించిన ప్రజ్ఞా ఠాకూర్ ను ఎన్నటికీ క్షమించలేను: మోదీ
- ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఖండించాల్సిందేనన్న ప్రధాని
- సాధ్వీ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దుమారం
- నష్టనివారణకు దిగిన కమలనాథులు
వివాదాస్పద నేత, మాలేగావ్ పేలుళ్లకేసు నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ బీజేపీకి తలనొప్పిగా మారినట్టు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే గొప్ప దేశభక్తుడు అంటూ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధినాయకత్వాన్ని దుమ్మెత్తిపోస్తోంది. దాంతో నష్టనివారణకు దిగిన కాషాయదళం ఈ విషయంలో ప్రజ్ఞా సింగ్ ను తప్పుబడుతోంది. ఇప్పటికే పార్టీ జాతీయ చీఫ్ అమిత్ షా కూడా ప్రజ్ఞా విషయంలో స్పందించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రజ్ఞా సింగ్ పై సీరియస్ అయ్యారు.
బాపూని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ ను ఎన్నటికీ క్షమించలేనని మోదీ పేర్కొన్నారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కు భోపాల్ లోక్ సభ టికెట్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడగా, అప్పట్లో మోదీనే ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడాయనే ప్రజ్ఞా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమె వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని తెలిపిన ప్రధాని, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా ఖండించాల్సిందేనని అన్నారు. కాగా, తన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రజ్ఞా సింగ్ నేరుగా క్షమాపణలు చెప్పకుండా తన ప్రతినిధితో ప్రకటన చేయించారు.