Andhra Pradesh: అక్రమాలకు పాల్పడకపోతే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు?: విజయసాయిరెడ్డి
- చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేశారు
- అక్రమాలు రుజువు కావడంతో ఈసీ రీపోలింగ్ కు ఆదేశించింది
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు 5 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. అక్రమాలకు పాల్పడకపోతే రీపోలింగ్ అనగానే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయని రుజువు కావడంతోనే ఈసీ రీపోలింగ్ కు ఆదేశించిందని స్పష్టం చేశారు. ఈసీ రీపోలింగ్ అనగానే సిగ్గులేకుండా ఆందోళనకు దిగుతున్నారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలోని దళితులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూతుల్లో దళితులను బెదిరించి టీడీపీ రిగ్గింగుకు పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో ఈసీ రీపోలింగుకు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడకపోతే వాళ్లకెందుకు భయం. రీపోలింగ్ అన్యాయం అంటూ ఆందోళనకు దిగడమేమిటి సిగ్గులేకుండా? దళితులు ఈసారి సత్తా చూపాలి’ అని ట్వీట్ చేశారు.