Kamal Haasan: నన్ను అరెస్ట్ చేస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి: కమలహాసన్

  • ప్రతి మతంలోను ఉగ్రవాదులు ఉన్నారు
  • చరిత్రను చూస్తే అలాంటివారు ఎందరో కనిపిస్తారు
  • చెప్పులు విసిరినా, రాళ్లు విసిరినా భయపడను

మహాత్మాగాంధీని చంపిన గాడ్సేని ఉద్దేశిస్తూ... 'స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువే' అంటూ ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై హిందూ సంఘాలు, బీజేపీ వర్గీయులు మండిపడుతున్నారు. ఆయనపై చెప్పులతో కూడా దాడి జరిగింది. ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో, ఓ జాతీయ ఛానల్ తో కమల్ మాట్లాడుతూ, తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకు తాను భయపడటం లేదని చెప్పిన ఆయన... ప్రతి మతంలోనూ ఉగ్రవాదులు ఉన్నారని అన్నారు. చరిత్రను చూస్తే ప్రతి మతంలోనూ మనకు అలాంటి వ్యక్తులు ఎందరో కనిపిస్తారని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే తాను వ్యాఖ్యానించానని... ప్రతి మతంలోనూ టెర్రరిస్టులు ఉన్నారని అన్నానని తెలిపారు. మనకు మనమే గొప్ప అని చెప్పుకోవడం సరికాదని అన్నారు.

తనపై చెప్పులు విసిరినా, రాళ్లు విసిరినా భయపడనని కమల్ చెప్పారు. మతాల మధ్య సామరస్యం కోసమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని... తాను ఏం చెప్పానో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతస్తులందరికీ అర్థం కావాలని అన్నారు. తనను పోలీసులు అరెస్ట్ చేస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని చెప్పారు.

Kamal Haasan
mnm
godsey
gandhi
  • Loading...

More Telugu News