punjam: అవును...అమె అబద్ధం చెప్పదు: భార్యను వెనకేసుకు వచ్చిన నవజోత్‌సింగ్ సిద్ధూ
- తనకు అమృతసర్ టికెట్టు రాకుండా సీఎం అడ్డుకున్నారని సిద్ధూ భార్య ఆరోపణ
- మహిళలకు గౌరవం ఇవ్వడం అమరీందర్ నేర్చుకోవాలని చురక
- ఈ వ్యాఖ్యలను సమర్థించిన మంత్రి
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ను ఉద్దేశించి తన భార్య నవజోత్ కౌర్ చేసిన ఆరోపణలను సమర్థించారు మంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ. ‘నా భార్య ధైర్యవంతురాలు, నైతిక విలువలు ఉన్న మనిషి. ఆమె ఎప్పుడూ అబద్ధం చెప్పరు’ అంటూ వెనకేసుకు వచ్చారు. ఆమెకు టికెట్టు రాకుండా అడ్డుపడడమేకాక, ఆమే పోటీ చేయడానికి నిరాకరించారని సీఎం స్థాయి వ్యక్తి చెప్పడం తప్పని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో అమృతసర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలని భావించినా టికెట్టు రాకుండా ముఖ్యమంత్రి అమరీందర్ అడ్డుకున్నారని, కొన్నాళ్ల క్రితం జరిగిన రైలు దుర్ఘటన నేపథ్యంలో తాను ఓడిపోయే అవకాశం ఉందంటూ, తప్పుడు సమాచారం ఇచ్చారని సిద్ధూ భార్య నవజోత్ కౌర్ ఇటీవల ఆరోపించడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, అమరీందర్ మహిళా రిజర్వేషన్ కోసం మాట్లాడుతారు కానీ, తనలాంటి చదువుకున్న వారికి టికెట్టు రాకుండా మాత్రం అడ్డుపడతారని విమర్శించారు. మహిళలకు గౌరవం ఇవ్వడం సీఎం నేర్చుకోవాలన్నారు. ఆమె వ్యాఖ్యలను సీఎం ఖండించారు. టికెట్లు కేటాయించేది అధిష్ఠానం అని, పైగా ఆమె పోటీ చేయాలనుకున్నది చండీఘడ్ పరిధిలోని నియోజకవర్గం అని కౌంటర్ ఇచ్చారు.