Andhra Pradesh: ‘చంద్రగిరి రీ-పోలింగ్’ వ్యవహారంలో నన్ను తప్పుపట్టడం సరికాదు!: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • ఏడు గ్రామాల్లో ఎస్సీలు ఓటేయలేదని ఫిర్యాదు అందింది
  • దాన్ని నేను ఈసీకి పంపా.. తుది నిర్ణయం వాళ్లే తీసుకున్నారు
  • ప్రతీ ఒక్కరు ఓటేసేలా చూడటం అధికారులుగా మా బాధ్యత

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగడం వెనుక తన పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఖండించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 7 గ్రామాల్లో ఎస్సీ సామాజికవర్గం ప్రజలు అసలు ఓటే వేయలేదని తనకు ఫిర్యాదు అందిందని తెలిపారు. ఇది తీవ్రమైన అంశం కావడంతో తాను ఆ ఫిర్యాదును ఏపీ ఎన్నికల సంఘానికి పంపానని చెప్పారు. ఈ వ్యవహారంలో సాక్ష్యాలను పరిశీలించిన ఈసీ చివరికి రీపోలింగ్ జరపాలని నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు.

కాబట్టి రీపోలింగ్ విషయంలో తనను తప్పుపట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రతీఒక్కరూ ఓటేసేలా చూడటం ఎన్నికల అధికారులుగా తమ బాధ్యత అని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం సమన్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులదే అనీ, పాలన గుడ్డిగా సాగే పరిస్థితి రానివ్వకూడదని చెప్పారు. మరోవైపు చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో 13 మంది సీఐలు, 17 మంది ఎస్‌ఐలు, 50 మంది సివిల్‌ పోలీసులు, వంద మంది స్పెషల్‌ పోలీసులను మోహరించారు. రీపోలింగ్‌ జరిగే మే 19 వరకూ ఇక్కడ 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News