Siddipet District: పెళ్లికి అంగీకరించరని.. చదువుకున్న పాఠశాలలోనే ఉరేసుకున్న ప్రేమ జంట

  • మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న కనకయ్య-తార
  • రెండేళ్ల క్రితం గొడవ జరిగినా మళ్లీ మామూలే
  • పురుగుల మందు తాగి ఆపై ఉరేసుకున్న ప్రేమికులు

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న అనుమానంతో ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. తాము చదువుకున్న బడిలో ఒకే కొక్కానికి ఉరివేసుకుని ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని లకుడారం గ్రామంలో జరిగిందీ విషాద ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన  ముంజె కనకయ్య (21), రాచకొండ తార (19) తొమ్మిదో తరగతి వరకు స్థానిక పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఇద్దరూ స్కూలు మానేశారు.

కనకయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. కాగా, కనకయ్య-తార గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే, రెండేళ్ల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో యువతి తల్లిదండ్రులు గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. ఈ సందర్భంగా  కనకయ్య కుటుంబానికి పంచాయితీ పెద్దలు రూ.30 వేల జరిమానా విధించారు. ఈ ఘటన తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే, ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని అభిప్రాయపడ్డారు. దీంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఇద్దరూ తాము చదువుకున్న పాఠశాలకు వచ్చి పురుగుల మందు తాగారు. అనంతరం తరగతి గదిలో ఒకే కొక్కానికి ఉరివేసుకున్నారు. గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Siddipet District
lovers
Marriage
suicide
Telangana
  • Loading...

More Telugu News