Telugudesam: ఈసీ విశ్వసనీయత ఏపాటిదో అప్పుడే అర్థమైంది: ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
- టీడీపీ ఫిర్యాదులను ఈసీ బుట్టదాఖలు చేసింది
- వైసీపీ ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించారు
- ద్వివేది సెలవుపై వెళ్లడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసిన టీడీపీ నేతలు
టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై మరోసారి బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కారు. టీడీపీ నేతలు చంద్రగిరి రీపోలింగ్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈఓ సుజాతా శర్మను కలిసి వినతిపత్రం అందించారు. చంద్రగిరి నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల కూడా రీపోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ పోలింగ్ రోజున వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే ఈసీ వెంటనే స్పందించిందని, తాము చేసిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ అంశంలో ఈసీ విశ్వసనీయత ఏమిటో అందరికీ అర్థమైందని నక్కా వ్యంగ్యం ప్రదర్శించారు.
వైసీపీ నేతలు చిన్న ఫిర్యాదు చేసినా సత్వరమే చర్యలు తీసుకుంటున్న ఈసీ, పోలింగ్ రోజు వైసీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసే ఫిర్యాదులపై ఈసీ ఎందుకు నియమావళిని సరిచూసుకోవడంలేదు? అంటూ నిలదీశారు. ఎన్నికలు ప్రారంభం కాకముందే జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘంపై మొదట్లోనే నమ్మకం పోయిందని, అయినప్పటికీ ప్రతి విషయం ఫిర్యాదు చేశామని నక్కా చెప్పారు. అయితే రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు టీడీపీ తనవంతుగా ప్రయత్నిస్తోందని అన్నారు.
ఇతర టీడీపీ నేతలు కూడా ఈసీ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నడూ రెండోసారి రీపోలింగ్ జరిగిన దాఖలాలు లేవని అన్నారు. కోడ్ అమలులో ఉన్న సమయంలో సీఈవో ద్వివేది సెలవుపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. రెండోసారి రీపోలింగ్ నిర్వహించడంపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.