Chandrababu: చంద్రబాబు ఆదేశాలతోనే దాసరి, ఏఎన్నార్, హరికృష్ణ విగ్రహాల తొలగింపు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- వారు వైసీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోయారు
- నా పైనా చంద్రబాబుకు కోపం ఉంది
- 3 విగ్రహాలపైనే ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది?
సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌లు తొలగించారని రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. నేడు ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ, ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, దాసరి కుమారుడు అరుణ్, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరడాన్ని సహించలేక చంద్రబాబు ఇలా చేశారని ఆరోపించారు.
వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని గతంలో తాను వ్యాఖ్యానించడంతో తన పైనా చంద్రబాబుకి కోపముందని, ఆ కారణంగానే తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించారని ఆరోపించారు. బీచ్ రోడ్డులో మరెందరివో విగ్రహాలున్నాయని వాటిని వదిలేసి ఈ మూడు విగ్రహాలపైనే జనసేన నేత ఎం.సత్యనారాయణ ఎందుకు కోర్టులో కేసు వేశారని యార్లగడ్డ ప్రశ్నించారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు వాటిని తొలగించడానికి ఎందుకు ఆదేశించారో చెప్పాలని నిలదీశారు.