tv9: టీవీ9 చానల్లోనే కొనసాగాలనుకుంటున్నా, కుదరకపోతే మరో చానల్ ప్రారంభిస్తా!: రవిప్రకాశ్
- మూఢనమ్మకాలను, జ్యోతిష్యాలను ప్రోత్సహించలేదు
- 15 ఏళ్ల కృషి ఫలితమే టీవీ9 ఈ స్థితిలో ఉంది
- రామేశ్వర్ రావు చానల్ ను పూర్తిగా మార్చేస్తారు
అనూహ్యరీతిలో టీవీ9 మీడియా సంస్థ నుంచి సీఈఓగా తొలగింపునకు గురైన రవిప్రకాశ్ తాజా పరిణామాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. తాము టీవీ9 చానల్ ను ఏ పార్టీకి కొమ్ముకాయని మీడియా సంస్థగా రూపుదిద్దామని చెప్పారు. ఇతర తెలుగు చానళ్ల లాగా తాము మూఢనమ్మకాలను, జ్యోతిష్యాలను ప్రోత్సహించమని అన్నారు. కానీ, టీవీ9 చానల్ పై కన్నేసిన 'మై హోం' జూపల్లి రామేశ్వర్ రావు అలంద మీడియా సంస్థ ద్వారా దొడ్డిదారిన ప్రవేశించారని ఆరోపించారు.
రామేశ్వర్ రావు ఇప్పుడు టీవీ9 చానల్ లో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని, అయితే తమ 15 ఏళ్ల కృషి ఫలితమైన టీవీ9 చానల్ యథాతథంగా ఉంటుందనే ఆశిస్తున్నానని రవిప్రకాశ్ తెలిపారు. తనపై మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తానో జర్నలిస్టునని, అసాధ్యమనదగ్గ రీతిలో చానల్ ను అభివృద్ధి చేశానని అన్నారు. తాను ఇప్పటికీ టీవీ9 చానల్ లో షో నిర్వహించాలని బలంగా కోరుకుంటున్నానని, ఒకవేళ వీలవకపోతే మరో చానల్ ప్రారంభించి, మొదటి నుంచి అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.