Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నెత్తిన పాలు పోసిన కాంగ్రెస్!... ఎన్డీటీవీ విశ్లేషణలో ఆసక్తికర అంశాలు
- ఓట్ల చీలిక కమలనాథులకు కలిసొస్తుంది
- కాంగ్రెస్ వల్ల కూటమి అవకాశాలకు దెబ్బ
- కాంగ్రెస్ కు పది శాతం మేర పెరిగే ఓటింగ్
దేశంలోకెల్లా అత్యధిక లోక్ సభ నియోజకవర్గాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడున్న 80 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీకి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏమంత కష్టం కాదని గత చరిత్ర చెబుతోంది. 2014లో ఎన్నికల్లో బీజేపీ యూపీలో 71 స్థానాలు గెలిచింది. అయితే ఈసారి ఆ స్థాయిలో కాకపోయినా గణనీయమైన స్థాయిలోనే బీజేపీ తన హవా చాటుతుందని ఎన్డీటీవీ విశ్లేషాణాత్మక కథనం వెలువరించింది.
బీజేపీకి కంచుకోటలా మారిన ఉత్తరప్రదేశ్ లో తమ సత్తా నిరూపించుకోవాలని సమాజ్ వాదీ, బీఎస్పీ జట్టు కట్టాయి. కాంగ్రెస్ కూడా వాటితో కలవాలని భావించినా పొత్తులో భాగంగా రెండంటే రెండు సీట్లు ఇవ్వజూపడంతో ఈ జాతీయ పార్టీ సొంతంగానే బరిలో దిగాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ తీసుకున్న ఆ నిర్ణయమే బీజేపీకి తాజా ఎన్నికల్లో కలిసొచ్చిందన్నది ఎన్డీటీవీ కథనం.
ఎస్పీ-బీఎస్పీ కూటమిపై వ్యతిరేకతతో కాంగ్రెస్ ఇక్కడ ప్రియాంక గాంధీతో విస్తృతంగా ప్రచారం చేయించడంతో పాటు మెరికల్లాంటి అభ్యర్థులను బరిలో దింపింది. ఈ ఎత్తుగడ ఎస్పీ, బీఎస్పీలకు రావాల్సిన ఓట్లను చీల్చిందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ ఓట్ల చీలిక అటు కాంగ్రెస్ కూ, ఇటు ఎస్పీ-బీఎస్పీ కూటమికి మేలు చేయకపోగా, అంతిమంగా బీజేపీకి లాభదాయకంగా మారుతోందట.
కాంగ్రెస్ కు 10 శాతం మేర ఓటింగ్ పెరిగినా అవన్నీ ఎస్పీ-బీఎస్పీకి వెళ్లాల్సిన ఓట్లే. సరిగ్గా చెప్పాలంటే, బీజేపీ వ్యతిరేక ఓట్లను ఎవరూ గంపగుత్తగా సాధించలేరని అంటున్నారు. దాంతో అటు కూటమి, ఇటు కాంగ్రెస్ సాధారణ ఓటింగ్ తో చతికిలబడే పరిస్థితి నెలకొనగా, బీజేపీ మాత్రం ప్రత్యర్థుల కంటే మెరుగైన స్థితిలో నిలుస్తోందని ఎన్డీటీవీ వివరించింది.