Andhra Pradesh: అదరగొట్టిన అమ్మాయిలు.. ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల!
- మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత నమోదు
- అగ్రస్థానంలో తూర్పుగోదావరి.. చిట్టచివరన నెల్లూరు
- రెండ్రోజుల్లో మార్కుల మెమో అందుబాటులోకి
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో 6,21,634 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాశారని సంధ్యారాణి తెలిపారు. మొత్తం 94.88 శాతం మంది పాస్ అయ్యారని ఆమె ప్రకటించారు.
వీరిలో బాలురు 94.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిల్లో 95.09 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటుగా పరీక్ష రాసిన విద్యార్థుల ఉత్తీర్ణత 58.80 శాతం నమోదయిందని చెప్పారు. ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాసిన అబ్బాయిల్లో 56.72 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిల్లో 61.82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఏపీలో 11,690 పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారని సంధ్యారాణి తెలిపారు. వీటిలో 5464 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని సంధ్యారాణి తెలిపారు. గతంలో 17 స్కూళ్లలో సున్నా పాస్ పర్సంటేజ్ ఉండగా ఈసారి అది 3 పాఠశాలలకే పరిమితమయిందని అన్నారు.
పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత విషయంలో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 98.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, కనిష్టంగా నెల్లూరు జిల్లాలో 89.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని చెప్పారు.
ఇక మంచి పాస్ పర్సంటేజ్ నమోదు చేసిన పాఠశాలల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అగ్రస్థానంలో నిలిచాయని సంధ్యారాణి తెలిపారు. ఇక్కడ 98.24 శాతం ఉత్తీర్ణత నమోదయిందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవని స్పష్టం చేశారు. అలాగే ఈ మార్కుల మెమోలను రెండ్రోజుల్లో వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.