shavukaru janaki: నేను సినిమాల్లోకి వెళతానని చెప్పగానే మా వాళ్లు నాకు పెళ్లి చేసేశారు: 'షావుకారు' జానకి
- మా సొంత ఊరు రాజమండ్రి
- రేడియో నాటకాలు వేసేదానిని
- బి.ఎన్.రెడ్డి గారు నా కోసం వచ్చారు
తెలుగు తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించిన అలనాటి కథానాయికలలో 'షావుకారు' జానకి ఒకరు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు.
"మాది రాజమండ్రి .. ఆచార సంప్రదాయాలు కచ్చితంగా పాటించే బ్రాహ్మణ కుటుంబం. అమ్మా నాన్నలు మమ్మల్ని చాలా పద్ధతిగా పెంచారు. చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే నటన పట్ల ఆసక్తి ఉండటంతో, 15 ఏళ్ల వయసులోనే రేడియో నాటకాలు వేస్తుండేదానిని. రేడియోలో నా వాయిస్ విన్న బి.ఎన్. రెడ్డిగారు రేడియో స్టేషన్ డైరెక్టర్ కి ఫోన్ చేసి నా గురించి వాకబు చేశారట. స్టేషన్ డైరెక్టర్ అనుమతిని తీసుకుని వచ్చి ఆయన నన్ను కలుసుకున్నారు. 'సినిమాల్లో చేస్తావా?' అని ఆయన అడిగితే, ఎగిరిగంతేశాను. ఇంటికి వచ్చి ఆ విషయం అమ్మానాన్నలకి చెప్పగానే, చకచకా సంబంధం చూసేసి పెళ్లి చేసేశారు" అని చెప్పుకొచ్చారు.