Stalin: కేసీఆర్ తనను కలవడంపై స్టాలిన్ స్పందనిది!
- నిన్న స్టాలిన్ తో కేసీఆర్ చర్చలు
- ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే మాటపై ఉండాలన్న కేసీఆర్
- మిగతా పార్టీలను కలపాలని కోరానన్న స్టాలిన్
నిన్న చెన్నై వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎంకే నేత స్టాలిన్ తో ప్రత్యేకంగా సమావేశమై, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు సాగించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తనను కలవడంపై స్టాలిన్ ఈ ఉదయం స్పందించారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క మాట మీద నిలబడాలన్నది కేసీఆర్ ఉద్దేశమని, ఇదే విషయాన్ని ఆయన తనతో ప్రతిపాదించారని, తాము కూడా అందుకు సమ్మతమేనని, మిగతా ప్రాంతీయ పార్టీల స్పందనను చూసిన తరువాత తమ అభిప్రాయాన్ని చెబుతామని స్పష్టం చేశామని అన్నారు.
దేశానికి నరేంద్ర మోదీ ప్రమాదకారిగా అవతరించారని, ఆయన్ను పదవికి దూరం చేసేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తప్పనిసరని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తాను అంగీకరిస్తున్నానని అన్నారు. ప్రాంతీయ కూటమిని బలపరిచే దిశగా కేసీఆర్ ముందుండి నడవాలని తాను కోరానని స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు వచ్చిన ఆయన్ను మర్యాద పూర్వకంగానే తాను కలిశానని చెప్పారు. ఇక మూడో కూటమి ఏర్పాటు అంశంపై 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత మాత్రమే ఓ స్పష్టత వస్తుందని అభిప్రాయపడుతున్నట్టు తెలిపారు.