Tirumala: తిరుమలకు మరో ఘాట్ రోడ్డు.. సర్వే రిపోర్ట్ సిద్ధం!
- 2.1 కిలోమీటర్ల పొడవు, రూ. 25 కోట్ల వ్యయం
- పూర్తయిన సర్వే, మరో వారంలో నివేదిక
- ఎన్నికల ఫలితాల తరువాత తుది నిర్ణయం
తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం, రెండో కనుమ మార్గంలో కొండచరియలు విరిగి పడే ప్రమాదం పెరగడంతో, మరో కనుమదారిని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. ఈ కొత్త రోడ్డు 2.1 కిలోమీటర్ల దూరంతో నాలుగు వరుసలుగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో సర్వే చేసిన ఎల్అండ్ టీ, మరో వారంలో టీటీడీ ఇంజినీరింగ్ అధికారులకు రిపోర్టును అందించనుంది.
అలిపిరి నుంచి తిరుమలకు దారి తీసే రెండో కనుమ మార్గంలో 13వ కిలోమీటర్ నుంచి ప్రారంభమయ్యే కొత్త దారి, జీఎన్సీ టోల్ గేట్ వరకూ ఉంటుంది. సరిగ్గా 13వ కిలోమీటర్ నుంచే రెండు రహదారులను కలిపే లింక్ రోడ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక కొత్త రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్ల వరకూ అవసరమని, కొన్ని చోట్ల నేలను చదును చేయాల్సి వున్నందున మరో రూ. 2 కోట్ల వరకూ అంచనా వ్యయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మాత్రమే పాలకమండలి ఈ కొత్త రోడ్డు నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.