Sri Lanka: శ్రీలంక పేలుళ్ల కేసు.. సౌదీ విద్యావేత్త, మత బోధకుడి అరెస్ట్
- మొహమ్మద్ అలియార్ను అరెస్ట్ చేసిన పోలీసులు
- పేలుళ్ల సూత్రధారి జహ్రాన్ హషీంతో అలియార్కు సంబంధాలు
- సెంటర్ ఫర్ ఇస్లామిక్ గైడెన్స్ స్థాపన
ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులకు సంబంధించి మరో కీలక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌదీ అరేబియాకు చెందిన విద్యావేత్త, మత బోధకుడు మొహమ్మద్ అలియార్ (60)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న జహ్రాన్ హషీంతో అలియార్కు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఆర్థికపరమైన లావాదేవీలను కూడా ఆయనే చూస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అంతేకాదు, హోటళ్లలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆయనే శిక్షణ ఇచ్చాడని పోలీసులు పేర్కొన్నారు. ‘సెంటర్ ఫర్ ఇస్లామిక్ గైడెన్స్’ వ్యవస్థాపకుడైన అలియార్.. జహ్రాన్ సొంత పట్టణమైన కట్టంకుడిలో మసీదు, మతపాఠశాల, లైబ్రరీని కూడా ఏర్పాటు చేశాడు. శ్రీలంక తూర్పు తీరంలో ఉన్న కట్టంకుడిలో ముస్లింల ఆధిపత్యం ఎక్కువ.