New Delhi: ఢిల్లీలో పోలింగ్ ఇలా ముగిసిందో లేదో.. కిక్కిరిసిన వైన్‌షాపులు.. కనిపించిన నోస్టాక్ బోర్డులు!
- శుక్రవారం సాయంత్రం మూతబడిన మద్యం దుకాణాలు
- ఆదివారం పోలింగ్ ముగిశాక తెరుచుకున్న షాపులు
- వైన్‌షాపుల వద్ద మందుబాబుల జాతర
ఢిల్లీలో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఇలా పోలింగ్ ముగిసిందో, లేదో.. వైన్‌షాపులు కిక్కిరిసిపోయాయి. రెండు రోజులుగా మద్యం దొరక్కపోవడంతో నాలుక పిడచకట్టుకుపోయిన మందుబాబులు ఆగలేకపోయారు. షాపులు తెరిచీ తెరవగానే వాటిపై పడ్డారు. వారి దెబ్బకు షాపుల వద్ద జాతర వాతావరణం కనిపించింది. చాలా దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఇదే వాతావరణం కనిపించింది. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.
శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగిసిన అనంతరం ఎన్నికల సంఘం ఆదేశాలతో మద్యం షాపులను మూసివేశారు. దీంతో రెండు రోజులపాటు దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు విషయాన్ని ముందే గ్రహించిన మందుబాబులు శుక్రవారమే పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకున్నారు. శనివారం షాపులు పూర్తిగా మూతపడ్డాయి. తిరిగి ఆదివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఆరు గంటల ప్రాంతంలో దుకాణాలు తెరుచుకున్నాయి. దాదాపు 36 గంటలపాటు మద్యం లేక నానా అవస్థలు పడిన మద్యం ప్రియులు ఆదివారం షాపులు తెరిచీ తెరవగానే వాటిపై పడ్డారు. దీంతో దుకాణాల వద్ద కోలాహలం నెలకొంది. చాలా షాపుల ఎదుట ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి.