Andhra Pradesh: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యంకాదు... వైసీపీ నేతలు ఆర్టీసీని నాశనం చేయాలని చూస్తున్నారు: వర్ల
- ఆర్టీసీని కాంగ్రెస్ నేతలు జేబు సంస్థగా మార్చారు
- రూ.1500 కోట్లతో సంస్థ నష్టాల నుంచి గట్టెక్కుతుంది
- చార్జీలపై ఏటా 7.5 శాతం పెంపునకు ప్రతిపాదనలు పెడుతున్నాం
ప్రభుత్వ రంగ రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఏపీ గవర్నమెంటుకు సమ్మె నోటీసులు ఇవ్వడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని తేల్చి చెప్పారు. వైసీపీ నాయకులు ఆర్టీసీని నాశనం చేయాలని కోరుకుంటున్నారని, గతంలో కాంగ్రెస్ నేతలు ఆర్టీసీని జేబు సంస్థగా మార్చారని విమర్శించారు.
అయితే, రూ.1500 కోట్లు ఇస్తే ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటపడుతుందని, దానికితోడు ఏటా 7.5 శాతం చార్జీల పెంపునకు అనుమతి ఇస్తే సంస్థకు నష్టాలు తప్పుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు తాము ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెడుతున్నట్టు వెల్లడించారు.