Telangana: పూటుగా మందుకొట్టి బస్సు నడిపిన డ్రైవర్.. ప్రయాణికుల హాహాకారాలు!

  • తెలంగాణలోని సూర్యాపేటలో ఘటన
  • సూర్యాపేట-వేములవాడ బస్సు డ్రైవర్ నిర్వాకం
  • ఆందోళనకు దిగిన ప్రయాణికులు

ప్రజలను క్షేమంగా గమ్యానికి చేర్చాల్సిన ఆర్టీసీ డ్రైవర్ నిబంధనలను తుంగలో తొక్కాడు. పూటుగా మద్యం సేవించి బస్సును నడపడం మొదలుపెట్టాడు. అయితే బస్సు రోడ్డుపై రోలర్ కోస్టర్ లా వెళుతుండటంతో ఆందోళన చెందిన ప్రయాణికులు హాహాకారాలు చేశారు. దీంతో బస్సును ఆపించి, వారందరిని కండక్టర్ మరో బస్సులో పంపించివేశాడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సూర్యాపేట డిపోకు చెందిన అద్దె బస్సు ఈరోజు సూర్యాపేట నుంచి వేములవాడకు బయలుదేరింది. ఈ బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే సూర్యాపేట జిల్లా నిమ్మికల్‌ వద్దకు రాగానే డ్రైవర్‌ చారి బస్సును ఓ ఇంటి వద్ద నిలిపాడు. అనంతరం లోపలకు వెళ్లి పూటుగా మద్యం సేవించి వచ్చాడు. బస్సును కొద్దిదూరం సరిగ్గానే నడిపినప్పటికీ, ఆ తర్వాత మాత్రం తూగడం మొదలుపెట్టాడు. దీంతో బస్సు అటూఈటూ ఊగిపోతూ ప్రయాణించడం మొదలుపెట్టింది.

దీన్ని గమనించిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో కండక్టర్ వీరందరినీ మరో బస్సులో ఎక్కించి పంపించివేశారు. అనంతరం బస్సును ఆర్టీసీ డిపోకు తరలించారు. ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో పోలీస్ అధికారులు కేసు నమోదుచేయలేదు.

Telangana
Suryapet District
RTC BUS
driver drunk
Police
  • Loading...

More Telugu News