: కాంగ్రెస్ అమలు చేస్తున్నవి మా పథకాలే: చంద్రబాబు
తాము రూపకల్పన చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. నగదు బదిలీ పథకం ఆలోచనతో పాటు మరెన్నో పథకాలు తమవే అని బాబు చెప్పారు. ఆయన ఈ రోజు సాయంత్రం గుంటూరులో జరిగిన నూర్ భాషా ముస్లిం బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నగదు బదిలీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే అవినీతి నియంత్రణ సాధ్యమే అని అభిప్రాయపడ్డారు. కానీ, కాంగ్రెస్ సర్కారు నగదు బదిలీ పథకాన్ని నకిలీ బదిలీ పథకంలా అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. సంక్షేమ పథకాల్లో కోత విధించడానికే ఈ పథకం తీసుకువచ్చారని విమర్శించారు.
అంతకుముందు నూర్ భాషా వర్గం గురించి మాట్లాడుతూ, సామాజిక న్యాయం జరిగే వరకు నూర్ భాషా ముస్లింలకు టీడీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నూర్ భాషాలు అత్యంత వెనకబడిన వర్గానికి చెందినవారని అన్నారు.