TV9: రవిప్రకాశ్ ఓ వాటాదారుడిగా షేర్ హోల్డర్ సమావేశాలకు రావొచ్చు: టీవీ9 కొత్త యాజమాన్యం
- రవిప్రకాశ్ ను సీఈవోగా తొలగించాం
- ఇకపై అతడు ఓ వాటాదారుడు మాత్రమే
- టీవీ9 చానల్లో కొలువైన కొత్త యాజమాన్యం
టీవీ9 చానల్ లో కొత్త యాజమాన్యం పూర్తిస్థాయిలో కొలువుదీరింది. ఇటీవలే టీవీ9 చానల్ ను అలంద మీడియా టేకోవర్ చేయగా, కొత్త డైరక్టర్లుగా సాంబశివరావు, కౌశిక్ రావు, శ్రీనివాస్, జగపతి బాధ్యతలు అందుకున్నారు. ఈ మేరకు టీవీ9 చానల్ మాతృసంస్థ ఏబీసీఎల్ పేర్కొంది. ఇవాళ సాయంత్రం ఏబీసీఎల్ బోర్డు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
బోర్డు డైరక్టర్లలో ఒకరైన సాంబశివరావు మాట్లాడుతూ, రవిప్రకాశ్ ను సీఈఓగా తొలగించామని, అయితే అతడికి చానల్ లో వాటాలు ఉన్న దృష్ట్యా ఓ షేర్ హోల్డర్ గా మాత్రమే రవిప్రకాశ్ వాటాదారుల సమావేశాలకు హాజరుకావొచ్చని స్పష్టం చేశారు.
సాధారణంగా 50 శాతానికి మించి వాటాలు ఉన్నవాళ్లకు సదరు సంస్థపై అధికారాలు ఉంటాయని, ఆ విధంగా తమకు 90.5 శాతం వాటాలు ఉన్నందున తాము చానల్ పై అధికారం తీసుకున్నామని సాంబశివరావు స్పష్టం చేశారు.