KTR: గల్ఫ్ లో అగచాట్లు పడుతున్న తెలంగాణ వాసికి విముక్తి... అధికారులకు కృతజ్ఞతలు చెప్పిన కేటీఆర్

  • రంజాన్ తర్వాత భారత్ రానున్న వీరయ్య
  • అబుదాబిలో అతి కష్టం మీద వీరయ్యను గుర్తించిన అధికారులు
  • వీరయ్యను పంపేందుకు ఒప్పుకున్న యజమాని

పొట్ట చేత్తో పట్టుకుని అబుదాబి వలస వెళ్లిన తెలంగాణ వాసి వీరయ్య పరాయిగడ్డపై తాను ఎదుర్కొంటున్న కష్టాలను ఓ వీడియో రూపంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చేరవేసిన సంగతి తెలిసిందే. అబుదాబిలో తన యజమానికి 100 ఒంటెలు ఉన్నాయని, వాటన్నింటిని తానొక్కడే చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని వీరయ్య ఆ వీడియోలో వాపోయాడు. వాటిలో ఒక ఒంటె చనిపోవడంతో యజమాని చితకబాదాడని, దవడపై కొట్టడంతో సరిగా మాట్లాడలేకపోతున్నానని భోరుమన్నాడు.

కరీంనగర్ జిల్లా తుమ్మాపురం మండలానికి చెందిన వీరయ్య తన తల్లి చనిపోయినా స్వదేశానికి రాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియోలో అతని బాధ చూసి చలించిపోయిన కేటీఆర్ వెంటనే విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు రంగంలోకి దిగి, అతి కష్టం మీద వీరయ్య ఎక్కడ ఉంటున్నదీ కనుగొన్నారు.

ఓ ఎడారిలో ఒంటెల నడుమ కనిపించిన వీరయ్యను కలిసి అతడి నుంచి వివరాలు సేకరించారు. వీరయ్యను స్వదేశానికి పంపేందుకు యజమాని కూడా ఎట్టకేలకు అంగీకరించడంతో అతడి కష్టాలు తీరనున్నాయి. రంజాన్ తర్వాత వీరయ్య భారత్ చేరుకోనున్నాడు. ఈ క్రమంలో రియాద్ లో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News