TV9: ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైన టీవీ9 భారత్ వర్ష్ చానల్
- ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మాయం అంటూ భారత్ వర్ష్ కథనం
- మండిపడిన ఈసీ
- తప్పుడు రిపోర్టింగ్ వద్దంటూ హితవు
టీవీ9 సీఈవో రవిప్రకాశ్ మానసపుత్రికగా పేరుగాంచిన జాతీయ వార్తాప్రసారాల చానల్ టీవీ9 భారత్ వర్ష్ కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైంది. ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, సాక్ష్యాధారాల్లేని వార్తలు వ్యాప్తి చేస్తున్నారంటూ ఈసీ భారత్ వర్ష్ చానల్ పై మండిపడింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మాయం అయ్యాయంటూ భారత్ వర్ష్ చానల్ ఓ కథనంలో పేర్కొంది. దీన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది.
ఈవీఎంలకు, వీవీ ప్యాట్లకు ఎంతో భద్రత ఉంటుందని, వాటి రవాణా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య, సునిశిత నిఘా నీడలో సాగుతుందని ఈసీ వివరించింది. అలాంటప్పుడు ఆధారాల్లేకుండా వార్తలు రాయడం సమంజసం కాదని, మరోసారి తప్పుడు రిపోర్టింగ్ చేయొద్దంటూ మందలించింది. జర్నలిజం ప్రమాణాలు కాపాడాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, టీవీ9 భారత్ వర్ష్ చానల్ కు నిధులు మళ్లించారన్న ఆరోపణలపైనే రవిప్రకాశ్ కు పోలీసులు నోటీసులు పంపడం తెలిసిందే.