Nizamabad District: ఇందూరు పసుపు రైతుల పోరాటంపై కేస్ స్టడీ.. ఐఎస్‌బీని కోరిన ఎన్నికల సంఘం!

  • మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఉపయుక్తమని యోచన
  • దీనిపై అధ్యయనం చేయాలని తెలంగాణ ఎన్నికల అధికారి ఆదేశం
  • నియోజకవర్గంలో 178 మంది రైతులు పోటీపడిన విషయం తెలిసిందే

పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర లభించని దుస్థితిని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్న ఇందూరు పసుపు రైతుల ప్రయత్నం మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఇకపై ప్రత్యేక పాఠం కానుంది. ఇందుకు అవసరమైన అధ్యయనం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)ని కోరారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 178 మంది ఇందూరు రైతులే. భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్‌ వేయడంతో ఇక్కడ ఎన్నికల నిర్వహణను ఎన్నికల సంఘం సవాల్‌గా తీసుకుంది.

ఇప్పటి వరకు నోటాతో కలిపి అత్యధికంగా 64 మంది బరిలో ఉంటే బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చారు. దీంతో తొలుత బ్యాలెట్‌ విధానంలోనే ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాలని యోచించినా ఫలితం వెలువడేందుకు సుదీర్ఘ సమయం పట్టడంతోపాటు ఓట్ల లెక్కింపులో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈవీఎంలనే వినియోగించారు.

అత్యాధునిక యంత్రాలుగా భావించే ఎం-3 రకం యంత్రాలను నిజామాబాద్‌లో వినియోగించారు. నోటాతో కలిపి 383 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినా ఎన్నికల నిర్వహణకు ఎం-3 యంత్రాలతో అవకాశం ఉంది. అటువంటి యంత్రాలను నిజామాబాద్‌లో ఉపయోగించి విజయవంతంగా పోలింగ్‌ పూర్తి చేశారు. దీన్ని గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం కోరింది. తాజాగా మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు పాఠంగా తీసుకురావాలని యోచిస్తోంది.

ఈ అంశంపై ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌కు మంచి ఉదాహరణ. ఈ విభాగంలో ఇప్పటి వరకు భారత్‌లో బలమైన కేస్‌ స్టడీలు లేవు. అందువల్ల ఈ ఎన్నిక సరైన కేస్‌ స్టడీ అవుతుందని, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉంటుందన్న ఉద్దేశంతో అధ్యయనానికి ఆదేశించినట్లు తెలిపారు.  ఐఎస్‌బీ అధికారులకు అవసరమైన సమాచారం అందిస్తామని చెప్పారు.

Nizamabad District
idur termaric farmer
ISB
  • Loading...

More Telugu News