Rajiv Gandhi: రాజీవ్ గురించి తప్పుగా మాట్లాడకుండా మోదీకి ఆదేశాలు జారీ చేయండి: ఈసీకి రక్తంతో లేఖ
- ప్రధానిపై చర్య తీసుకోండి
- అవన్నీ రాజీవ్ చలవే
- ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి
గతవారం ప్రధాని మోదీ యూపీలోని ప్రతాప్‌గఢ్ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై విమర్శలు గుప్పించే క్రమంలో ఆయన తండ్రి, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ తండ్రిని ఆయన అనుచరులు మిస్టర్ క్లీన్ అంటారని, అయితే ఆయన జీవితం నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగిసిందంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. తాజాగా అమేథీకి చెందిన మనోజ్ కశ్యప్ అనే 18 ఏళ్ల యువకుడు మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ తన రక్తంతో ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాడు. రాజీవ్ గాంధీ పేరును అపవిత్రం చేసేందుకు యత్నించిన ప్రధానిపై చర్య తీసుకోవాలని మనోజ్ లేఖలో ఈసీని కోరాడు.
రాజీవ్ గాంధీని విమర్శించే వారిని అమేథీ ప్రజలు, ఆయనను హత్య చేసిన వారితో సమానంగా భావిస్తారని పేర్కొన్నాడు. కంప్యూటర్ విప్లవం, పంచాయతీరాజ్ వ్యవస్థ, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం అన్నీ రాజీవ్ చలవేనని మనోజ్ లేఖలో పేర్కొన్నారు. రాజీవ్‌పై మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని లేఖలో పేర్కొన్నాడు. తన లేఖను పోల్ గిమ్మిక్‌గా పరిగణించవద్దని ఈసీని కోరాడు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సైతం ప్రశంసించిన రాజీవ్‌ని కించపరిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, రాజీవ్ గురించి మరోసారి తప్పుగా మాట్లాడకుండా మోదీకి ఆదేశాలు జారీ చేయాలని కశ్యప్ లేఖలో పేర్కొన్నాడు.