Andhra Pradesh: ఈ నెల 23 తర్వాత భారత్ కొత్త ప్రధానిని చూడబోతోంది!:సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- బీజేపీకి తీవ్ర పరాభవం తప్పదు
- ఫలితాలు వచ్చాక కూర్చుని చర్చిస్తాం
- ఢిల్లీలో మీడియాతో ఏపీ ముఖ్యమంత్రి
ఈ నెల 23 తర్వాత దేశం కొత్త ప్రధానిని చూడబోతోందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. బీజేపీకి ఈసారి తీవ్ర పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థి గురించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం కోల్ కతాకు వెళుతూ చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
‘భారత ప్రజాస్వామ్యం గొప్పతనం అదే. ప్రధాని ఎవరు అన్నది మీరు, నేను డిసైడ్ చేయలేం. మెజారిటీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును ఇచ్చేశారు. ఈనెల 23న ఫలితాల అనంతరం దేశానికి ఎవరు ప్రధాని అయితే మంచిదన్న విషయమై ఏకాభిప్రాయానికి వస్తాం.
ఈ నెల 21న సమీక్షా సమావేశం జరుగుతుంది. మే 23 తర్వాత సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అనంతరం కారులో విమానాశ్రయానికి బయలుదేరారు. కాగా, ఈరోజు, రేపు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తరఫున చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు.