BJP: ఏపీలో వైసీపీకి 110 స్థానాలు ఖాయం: బీజేపీ నేత మురళీధర్ రావు
- చంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు మూసుకుపోయాయి
- కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలు ఫలించవు
- గతంలో కంటే ఈసారి బీజేపీకి అత్యధిక స్థానాలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలపై బీజేపీ నేత మురళీధర్ రావు స్పందించారు. వైసీపీకి 110 స్థానాలు దక్కడం ఖాయమని అభిప్రాయపడ్డారు. తద్వారా ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది వైసీపీనే అని చెప్పకనే చెప్పారు. ఈ ఎన్నికలతో టీడీపీ ప్రస్థానం ముగుస్తుందని, ఎన్డీయేలో కూడా చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయని వ్యాఖ్యానించారు.
మరోవైపు, కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించబోవని మురళీధర్ రావు పేర్కొన్నారు. దేశంలో ప్రధాని మోదీపై వ్యతిరేకత ఏమీ లేదని, మోదీ ప్రభంజనంతో గతంలో కంటే ఈసారి బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలవబోతోందని జోస్యం చెప్పారు. ప్రత్యర్థి కూటములలోని అసమ్మతివాదుల మద్దతు బీజేపీకే ఉందని ఆయన వెల్లడించారు. అయితే, ఏపీ, తెలంగాణల్లో బీజేపీకి తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చినా ఆ నష్టాన్ని తమిళనాడులో అత్యధిక సీట్లు గెలవడం ద్వారా భర్తీ చేసుకుంటామని వివరించారు.