Telangana: పాత జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ ఎన్నికలు అనైతికం: సీఈసీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ కాంగ్రెస్

  • ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయాలి
  •  కొత్తగా ఎన్నికైనవారితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలి
  • డిమాండ్ చేసిన కాంగ్రెస్ తదితర పార్టీలు

పాత జడ్పీటీసీ, ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం అనైతికమని, చట్టవిరుద్ధమని తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో పట్నం నరేందర్ రెడ్డి, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వరంగల్ కు సంబంధించి కొండా మురళీధర్ రావు రాజీనామా చేయడంతో ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 31న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పాత జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం తన నోటిఫికేషన్ లో పేర్కొనడాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు టీజేఎస్, సీపీఐ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా, ఈ నెల 27న ఫలితాలు వెల్లడవుతాయని, కొత్త జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సర్టిఫికెట్లు కూడా జారీ అవుతాయని విపక్షాలు చెబుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పాత జడ్పీటీసీలు, పాత ఎంపీటీసీలనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం పేర్కొనడం పట్ల కాంగ్రెస్ సహా పలు పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు వాయిదావేసి, మరోసారి నోటిఫికేషన్ ను విడుదల చేయాలని, కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరపాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News