Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు.. ఈ నెల 10న నిర్వహించాలని సీఎస్ కు లేఖ!
- నోట్ పంపిన ముఖ్యమంత్రి కార్యాలయం
- కేబినెట్ అజెండా రూపొందించాలని ఆదేశం
- సీఎస్ నిర్ణయంపై రాజకీయ, అధికార వర్గాల్లో ఆసక్తి
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశానికి ముహూర్తం ఖరారయింది. ఈ నెల 10న కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సూచించింది. ఇందులో భాగంగా కేబినెట్ అజెండాను రూపొందించాలని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 10న ఉదయం 10.30 గంటలకు సమావేశం జరపాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ సీఎస్ కు నోట్ పంపించారు.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ, అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ కేబినెట్ భేటీలో ఫణి తుపాను ప్రభావం, నష్టపరిహారం, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, వేసవిలో మంచినీటి సమస్యలపై చర్చించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.