Andhra Pradesh: టీడీపీ బాక్సు బద్దలవుతోంది.. చంద్రబాబు ఓటమిని తప్పించుకోలేరు!: జీవీఎల్ జోస్యం

  • ఈవీఎంలు వాడొద్దని 2010లో పుస్తకం రాశా
  • అప్పట్లో వీవీప్యాట్లు లేవు.. లైటు మాత్రం వెలిగేది 
  • ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన జీవీఎల్

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడరాదని తాను 2010లో ఓ పుస్తకం రాసిన మాట వాస్తవమేనని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈవీఎంలకు వీవీప్యాట్ యంత్రాలను అనుసంధానం చేయలేదని తెలిపారు.

అప్పట్లో ఓటువేశాక ఈవీఎంలో ఓ లైటు వెలిగేదనీ, దీనివల్ల ఎవరికి ఓటేశామో తెలిసేది కాదని అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ సహా 22 ప్రతిపక్ష పార్టీలు 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంతో సరిపోల్చాలని సుప్రీంకోర్టును ఈరోజు మరోసారి ఆశ్రయించిన నేపథ్యంలో జీవీఎల్ ఈ మేరకు స్పందించారు.

ఈవీఎంల్లో మార్పు తీసుకురావాలని తాను బలంగా కోరుకున్నానని చెప్పారు. తమ పోరాటం కారణంగానే ఈవీఎంలకు వీవీప్యాట్ యంత్రాలను అనుసంధానించారని తెలిపారు. ‘ఇప్పుడున్న ఈవీఎంలను 2014 వరకూ ఉన్న ఈవీఎంలతో పోల్చడం తప్పు. ఏపీలోని మూడు కోట్ల మంది ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తే తమ ఓటు ఏ పార్టీకి పడిందో వారంతా చూసుకోగలిగారు.

చంద్రబాబు నాయుడు 2014లో పేపర్ ట్రయల్ లేకుండానే ఈవీఎంల ద్వారా గెలిచారు. ఇప్పుడు ఓడిపోతున్నామని తెలియడంతో తమ ఓటమి కారణాలను నోరు లేని మెషీన్లపై నెట్టేయాలనీ, ఈసీపై తోసేయాలని చూస్తున్నారు. మోదీపై, కేసీఆర్ పై బురద చల్లడానికి చంద్రబాబు చేస్తున్న డ్రామానే ఇది’ అని మండిపడ్డారు.

ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పులను 10 శాతం లెక్కించినా, 50 శాతం లెక్కించినా తమకు అభ్యంతరం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా శిరసావహిస్తామన్నారు. ‘వీవీప్యాట్లలోని స్లిప్పులను 50 శాతం లెక్కించినా, 10 శాతం లెక్కించినా వచ్చే ఓట్లలో తేడా ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ బాక్సు బద్దలవుతోంది. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలనడం సాకు మాత్రమే. ఇప్పటివరకూ వీవీప్యాట్లు లెక్కించిన చోట 100 శాతం మ్యాచింగ్ జరిగింది’ అని గుర్తుచేశారు. ఓటమి నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News