Sunstroke: నల్గొండలో ఏడుగురి ప్రాణాలు తీసిన వడగాలులు!

  • మండిపోతున్న ఎండలు
  • ఉద్ధృతంగా వీస్తున్న వడగాలులు
  • ఆవిరవుతున్న ప్రాణాలు

ప్రచండ భానుడి ఉగ్రరూపానికి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైబడి నమోదవుతున్నాయి. దీంతో వడగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడగాలుల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని లింగరాజుపల్లిలో ఒకరు, తిమ్మాపురంలో మరొకరు ప్రాణాలు కోల్పోగా,  భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాలలో ఒకరు, రామన్నగూడెంలో ఇంకొకరు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు విడిచారు.  నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లి, బైరవునిబండ గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి చెందగా, సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలంలో ‘ఉపాధి’ పని అనంతరం ఇంటికి వెళ్తున్న అంగరాజు చిన్న వెంకన్న(56) ఎండదెబ్బకు తాళలేక కిందపడి మృతి చెందాడు.

కాగా, నేడు, రేపు, ఎల్లుండి ఎండల తీవ్రత మరింతగా ఉంటుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చిన్నారులు, వృద్ధులు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని బాణాపురంలో సోమవారం అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోహిణి కార్తె రాకముందే ఎండలు ఈ స్థాయిలో ఉన్నాయంటే.. అప్పుడు ఇంకెలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు.

Sunstroke
summer
temperature
Nalgonda District
Telangana
  • Loading...

More Telugu News