Pakistan: హబుల్ టెలిస్కోప్ ను అంతరిక్షంలోకి పంపింది తామేనంటూ చెప్పి నవ్వులపాలైన పాకిస్థాన్ మంత్రి
- పాక్ అంతరిక్ష సంస్థ సుపార్కో హబుల్ ను రోదసిలో పంపిందన్న ఛౌదరీ
- 1990లో హబుల్ ను ప్రవేశపెట్టిన నాసా
- మంత్రిపై పేలుతున్న సెటైర్లు
పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఫవాద్ చౌధరీ హబుల్ టెలిస్కోప్ ను రోదసిలోకి పంపింది తమదేశానికి చెందిన అంతరిక్ష సంస్థ అని చెప్పి అభాసుపాలయ్యారు. జియో న్యూస్ చానల్ చేపట్టిన ఓ టాక్ షోలో సదరు మంత్రివర్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన హబుల్ టెలిస్కోప్ ను పాకిస్థాన్ కు చెందిన స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ (సుపార్కో) అంతరిక్షంలోకి పంపించిందని సెలవిచ్చారు.
మంత్రిగారు చెప్పింది విన్న న్యూస్ చానల్ యాంకర్ కు మతిపోయిందన్నది వేరే విషయం! దీనిపై నెట్టింట జోకులు మామూలుగా పేలడంలేదు. నాసా హెడ్ రాజీనామా చేసి ఫవాద్ చౌధరీ ఆధ్వర్యంలోని సుపార్కోలో జాయిన్ అవ్వాలంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఇలాంటి గొప్ప ఆవిష్కర్తను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అర్జంటుగా రోదసిలోకి ప్రయోగించాలని మరో నెటిజన్ సెటైర్ వేశారు.
కోట్లాది కాంతిసంవత్సరాల దూరాల్లో ఉండే నక్షత్రాలను, కొత్త గ్రహాలను గుర్తించేందుకు నాసా 1990లో హబుల్ టెలిస్కోప్ ను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అయితే ఆ విషయం తెలియని పాక్ సైన్స్ మినిస్టర్ ఫవాద్ ఛౌదరీ అదేదో తమ ఘనత అన్నట్టు చెప్పుకొచ్చారు.