Narendra Modi: అక్కయ్య ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు... దేవుడి గురించి మాట్లాడ్డంలేదు, వినడంలేదు: మమతపై మోదీ వ్యాఖ్యలు
- నేనూ జై శ్రీరామ్ నినాదాలు చేస్తా
- నన్ను అరెస్ట్ చేయించు చూద్దాం!
- మమతకు మోదీ సవాల్
కొంతకాలంగా పరస్పరం విమర్శలు విసురుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఎన్నికల సందడి మొదలైనప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వాడీవేడి వాతావరణం నెలకొంది. తాజాగా, పశ్చిమ బెంగాల్ లో కొందరు వ్యక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేయగా, మమత వారిపై తీవ్రంగా మండిపడినట్టు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఈ ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా పరిగణించినట్టు ఆయన మాటలు వింటే అర్థమవుతుంది.
ఇవాళ పశ్చిమ బెంగాల్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. తాను కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తానని, తనను అరెస్ట్ చేయించగలరా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. "జై శ్రీరామ్ నినాదాలు చేస్తే జైల్లో పెట్టిస్తారా? ఏదీ, నేను కూడా జై శ్రీరామ్ అంటాను, నన్ను జైల్లో పెట్టించు, చూద్దాం!" అంటూ కవ్వింపు ధోరణిలో వ్యాఖ్యలు చేశారు.
"దీదీ ఈ మధ్య తీవ్ర అసహనంతో ఉన్నారు, దేవుడి గురించి మాట్లాడడంలేదు, దేవుడి గురించి వినడంలేదు, ఆమె ప్రధాని కావాలని ఆశపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు సొంత రాష్ట్రంలో పది సీట్లు కూడా రావు" అంటూ ఎద్దేవా చేశారు.