NTR: ఎన్నికలకు వెళుతున్నారు కదా, మీ వద్ద 20 సూత్రాల ప్రణాళిక ఏదైనా ఉందా? అని అడిగిన విలేకరికి ఆనాడు ఎన్టీఆర్ ఏంచెప్పారో చూడండి!
- తన వద్ద అలాంటిదేమీ లేదన్న ఎన్టీఆర్
- తన వద్ద ఉన్నదాని గురించి చెప్పిన వైనం
- నాటి సంగతి ట్వీట్ చేసిన టీడీపీ
తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఓ ప్రభంజనం! కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఓ సంచలనం! ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఘనత నందమూరి తారకరామారావుకే దక్కింది. ఆనాడు ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి ముమ్మరంగా ప్రజల్లో తిరుగుతున్న సమయాన ఓ విలేకరి ఆయన ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. అతనికి కొంత సమయం కేటాయించిన ఎన్టీఆర్ ప్రశ్నలు అడగమన్నారు.
అప్పుడా పాత్రికేయుడు "ఎన్నికలకు వెళుతున్నారు కదా, మీవద్ద 20 సూత్రాల ప్రణాళిక ఏదైనా ఉందా?" అని ప్రశ్నించాడు. అందుకు ఎన్టీఆర్ "నా వద్ద 20 సూత్రాలో, 100 సూత్రాలో లేకపోవచ్చు. కానీ, నాదంటూ ఒక ఒకే సూత్రం ఉంది. ప్రజలకు అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించాలన్నదే ఆ ఒకే ఒక్క సూత్రం" అంటూ స్పష్టంగా చెప్పారు. ఎన్టీఆర్ నుంచి కంచుమోగినట్టు వచ్చిన ఆ సమాధానంతో ఆ విలేకరి పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆనాటి ఈ విషయాన్ని తాజాగా తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఫొటోతో సహా ట్వీట్ చేసింది.