Madhya Pradesh: సాధ్వీ ప్రజ్ఞా సింగ్ కు ఎదురుదెబ్బ... మూడు రోజుల నిషేధం విధించిన ఈసీ
- కర్కరే, బాబ్రీ వ్యాఖ్యల ఫలితం
- ఫిర్యాదు చేసిన స్థానికుడు
- నోటీసులు పంపిన ఎన్నికల అధికారి
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ కు పోలింగ్ ముంగిట గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను ఎన్నికల ప్రచారం నుంచి మూడు రోజుల పాటు నిషేధిస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీచేశారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడడంలో సాధ్వీ ప్రజ్ఞా సింగ్ తర్వాతే ఎవరైనా అని ప్రత్యర్థులు తరచుగా విమర్శిస్తుంటారు. ఇటీవల ఆమె చేసిన పలు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
టెర్రరిస్టు వ్యతిరేక దళం మాజీ చీఫ్, దివంగత ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరే తన శాపం తగిలే పోయాడని వ్యాఖ్యానించడంతో పాటు, బాబ్రీ మసీదు కూల్చివేతలో తాను కూడా భాగం పంచుకున్నానంటూ సంచలనం సృష్టించారు. వీటిపై ఎన్నికల సంఘానికి ఓ స్థానికుడి నుంచి ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపిన అధికారులు సాధ్వీపై 72 గంటల పాటు ప్రచారం నుంచి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు.
కాగా, సాధ్వీ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు ఎన్నోసార్లు సొంత పార్టీ బీజేపీకి తలనొప్పిగా మారాయి. ఇతర బీజేపీ నేతలు సైతం ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు.