Chandrababu: రేపు పోలవరం వెళతా... వెళితే తప్పేంటి?: చంద్రబాబు
- పోలవరం సమీక్ష కోడ్ ఉల్లంఘన కిందికి రాదు
- అమరావతిలో చంద్రబాబు మీడియా సమావేశం
- ఈసీ రియాక్షన్ పై సర్వత్రా ఆసక్తి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అటు ఎన్నికల సంఘం, ఇటు సీఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు. పోలింగ్ ముగిసినా, ఫలితాలకు సమయం ఉండడంతో అప్పటివరకు సమీక్షలు కుదరదంటూ తనపై ఆంక్షలు విధిస్తుండడం పట్ల చంద్రబాబు రగిలిపోతున్నారు. పైగా సమీక్ష జరపాలంటే అనుమతి తీసుకోవాల్సి రావడం ఆయనను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇవాళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రేపు పోలవరం వెళుతున్నానని, తాను పోలవరం వెళితే తప్పేంటి? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజక్టు పనులను సమీక్షించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని ప్రజావేదికలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే పలుమార్లు సీఎం సమీక్షలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో, ఎన్నికల సంఘానికి, చంద్రబాబుకు మధ్య స్పర్ధ తీవ్రమైంది. ఇప్పుడు పోలవరం వెళతానని చంద్రబాబు పట్టుదల ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈసీ ఎలా స్పందిస్తుందన్న విషయం ఆసక్తి కలిగిస్తోంది.