pm: మీకు పరిపాలించే అర్హత ఉందా?: మోదీపై చంద్రబాబు ఫైర్
- మోదీ మాటల ప్రధానే తప్ప, చేతల ప్రధాని కాదు
- ఇచ్చిన హామీలను మోదీ నిలబెట్టుకోలేకపోయారు
- తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోలేని పరిస్థితి కల్పించారు
రెండు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత పీఎం లేదా హోం మినిస్టర్ గానీ ఒక్క మీటింగ్ అయినా నిర్వహించారా? మీకు బాధ్యత లేదా? మీకు పరిపాలించే అర్హత ఉందా? అంటూ ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతిలో ప్రజావేదికలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోదీ మాటల ప్రధానే తప్ప, చేతల ప్రధాని కాదని విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని మోదీకి ఏపీపై ప్రేమ ఎక్కడ ఉంది? కపట ప్రేమ చూపిస్తూ నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కించపరిచేలా చౌకబారు మాటలు మాట్లాడుతున్న మోదీ, రాష్ట్ర విభజన గురించి ఇక్కడ కాకుండా, బీహార్ లో ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
ఆనాడు కేంద్రం విభజన చేసిందని, అందులో బీజేపీకీ భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోలేని పరిస్థితులు కల్పించారని విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో ఒక్కసారైనా రెండు రాష్ట్రాలతో మాట్లాడారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదన్న దానిపై ప్రజలకు సమాధానంతో పాటు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత మోదీకి ఉందని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ విమర్శలు చేయడం కరెక్టు కాదని అన్నారు. విభజన జరిగిన రోజు ఎలా బాధపడ్డామో, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నామని చెప్పారు.