Tamilnadu: మున్సిపల్ కమిషనర్ ను పెళ్లాడిన ఉద్యోగిని.. గంటలోనే వదిలేసిన భర్త!
- తమిళనాడులోని గుడియాత్తంలో ఘటన
- మున్సిపల్ కమిషనర్ బాలాజీ, రోజా ప్రేమాయణం
- వివాహానికి ఒప్పుకోని ఇరు కుటుంబాలు
నువ్వు లేకుండా నేను బతకలేను అన్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు. అయితే ఇరుకుటుంబాల మధ్య వాగ్వాదం జరగడంతో పెళ్లయిన గంటలోనే ఆమెకు బైబై చెప్పేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ విచిత్రమైన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తంలో జరిగింది.
చెన్నైకి చెందిన సెల్వ బాలాజీ(32) గుడియాత్తం మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు. అదే ఆఫీసులో రోజా(20) అనే యువతి కాంట్రాక్టు ఉద్యోగినిగా పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరూ, వారివారి ఇళ్లలో విషయాన్ని చెప్పారు. అయితే ఇందుకు ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో బాలాజీ ఎప్పటిలాగే గత శుక్రవారం ఆఫీసుకు వచ్చాడు.
అనంతరం కొద్దిసేపటికి రోజాతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తనను పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని హెచ్చరించిన రోజా.. మణికట్టును బ్లేడుతో కోసుకుంది. దీంతో ఆమెను ఊరడించిన బాలాజీ, పళ్లిగొండలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలాజీ కుటుంబ సభ్యులు తమ కుమారుడిని రోజా కుటుంబం కిడ్నాప్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో బాలాజీ కుటుంబ సభ్యులే తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని రోజా తల్లిదండ్రులు ఎదురు కేసు పెట్టారు. వీరిద్దరూ కలిసి తల్లిదండ్రుల ముందుకు రాగా, ఇరుకుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సెల్వ బాలాజీనీ అతని కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారు. దీంతో తన భర్తను తనతో పంపాలని రోజా ఆందోళనకు దిగింది.
దీంతో బాలాజీని పిలిపించిన పోలీసులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయినా విన్పించుకోని బాలాజీ రోజాను వదిలిపెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి వెళ్లిపోయాడు. మరోవైపు ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.