IRCTC: రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఐఆర్సీటీసీ!
- ఎక్కే స్టేషన్ ను మార్చుకునే సదుపాయం
- 24 గంటల నుంచి చార్ట్ తయారీ వరకూ చాన్స్
- స్టేషన్ మార్చుకుంటే క్యాన్సిల్ చేసుకున్నా రిఫండ్ నిల్
శ్రీనివాస్... సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లేందుకు కొచ్చిన్ ఎక్స్ ప్రెస్ లో టికెట్ ను రిజర్వేషన్ చేయించుకున్నాడు. కానీ, ప్రయాణానికి ముందు రోజు ఏదో పని మీద నల్గొండ జిల్లాకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పని ఆలస్యమైంది. దీంతో శ్రీనివాస్ సికింద్రాబాద్ లో రైలు ఎక్కే పరిస్థితి లేదు. కానీ, ఆ రైలు నల్గొండ మీదుగానే వెళుతుంది. నల్గొండలోనే రైలు ఎక్కాలంటే కుదరదు. రిజర్వేషన్ చేయించుకున్న తరువాత, ఎక్కే స్టేషన్ ను మార్చుకోవాలంటే కనీసం 24 గంటల ముందు మార్చుకోవాల్సిందే. రైలు ఎక్కకుంటే, రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతుంది.
ఇటువంటి ఇబ్బందులు ఇక ఉండవు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు, తమ బోర్డింగ్ స్టేషన్ ను చార్టు తయారీ ముందువరకు ఎక్కే స్టేషన్ ను మార్చుకునే సదుపాయం ఇప్పుడు దగ్గరైంది. అయితే, కౌంటర్లలో తీసుకునే టికెట్లకు ఈ వెసులుబాటు ఇప్పుడే లభించదు.
ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అయ్యి, బుకింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్లి.. రైలును ఎంచుకుని బోర్డింగ్ పాయింట్ మార్చుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. స్టేషన్ మార్చుకునే ప్రయాణికులకు, రెండు స్టేషన్లకూ మధ్య ఉన్న దూరానికి రైలు ఛార్జీ వెనక్కి రాదని స్పష్టం చేసింది. ఇక ఒకసారి బోర్డింగ్ పాయింట్ ను మార్చుకున్న తరువాత, ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తే, ఎటువంటి చార్జీలనూ ఇవ్వబోమని పేర్కొంది.