YSRCP: నేమ్ ప్లేట్ చేయించుకోవాల్సిన అవసరం జగన్ కు లేదు, సీఎం అయ్యాక వాళ్లే తీసుకొచ్చి ఇస్తారు: పృథ్వీరాజ్
- ఎవరైనా పిచ్చోడికి చెప్పండి నమ్ముతాడేమో!
- నేమ్ ప్లేట్ వ్యవహారాన్ని వైసీపీకి ఆపాదించొద్దు
- ఇవాళ జగన్ కు డూప్ ను తయారుచేసే టెక్నాలజీ ఉంది
పోలింగ్ ముగిసిన వెంటనే జగన్ పేరుతో ప్రత్యక్షమైన సీఎం నేమ్ ప్లేట్ సామాజిక మాధ్యమాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "జగన్ ది అత్యుత్సాహం", "తొందరపడి ఓ కోయిల ముందే కూసింది" అంటూ ప్రత్యర్థుల నుంచి దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత పృథ్వీరాజ్ మండిపడ్డారు. ఎవడో వెధవ ఆ విధంగా ప్రచారం చేస్తుంటే దాన్ని వైసీపీకి ఆపాదించడం ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఇవాళ జగన్ మోహన్ రెడ్డిలాగా ఓ డూప్ ను తయారుచేసే టెక్నాలజీ ఉంది. ఎవరికైనా డూప్ ను తయారుచేసి వారి వాయిస్ ను బయటికి పంపే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. విజయసాయి, ప్రశాంత్ కిషోర్ మాట్లాడినట్టు నెల్లూరులో మంత్రి నారాయణ గారి పీఏ పుట్టించినవి వైరల్ అయ్యాయి. ఇలాంటి యుగంలో ఉన్నప్పుడు ఎవడో వెధవ పుట్టించాడా నేమ్ ప్లేట్ ని!
అయినా, నేమ్ ప్లేట్ తయారుచేయించుకోవాల్సిన అవసరం జగన్ కి ఏముంది? రేపాయన సీఎం అయ్యాక వాళ్లే గౌరవంగా తెచ్చి ఇస్తారు. ఇంత చిన్న విషయం ఎందుకు తెలుసుకోరు మీరు? అప్పుడే ముఖ్యమంత్రిగా బోర్డంట! అంటూ విమర్శలు చేస్తున్నారు. ఎవరైనా పిచ్చోడికి చెప్పండి, మీ మాటలు నమ్ముతాడేమో!" అంటూ పరోక్షంగా టీడీపీ నేతలపై ఆవేశం ప్రదర్శించారు.