Chandrababu: మోదీతో మొదట్లోనే గొడవపెట్టుకుని ఉంటే చాలా నష్టపోయేవాళ్లం: చంద్రబాబు
- సరైన సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం
- వచ్చే రెండు, మూడు సీట్లకు వైసీపీ బేరాలు ప్రారంభించింది
- టీడీపీ విజయంపై సందేహం లేదు
ప్రధాని మోదీతో మొదట్లోనే గొడవ పెట్టుకుని ఉంటే చాలా నష్టపోయేవాళ్లమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీకి సహకారం అందిస్తారని ఎంతో ఎదురు చూశామని, సరైన సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎంతో ఓపికగా ఎదురు చూసినా నిర్లక్ష్యం చేశారనే నింద మోదీకే వచ్చిందని అన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే... పదవులు, కేసుల మాఫీ కోసం వైసీపీ పోరాడుతోందని ఎద్దేవా చేశారు. వచ్చే రెండు, మూడు సీట్లకు అప్పుడే బేరాలు ప్రారంభించారని విమర్శించారు. అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్ లో టీడీపీ సమీక్షా సమావేశాల్లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు పన్నిన కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు చెప్పారు. టీడీపీకి నష్టం కలిగించాలనేది బీజేపీ ధ్యేయమని, వారికి కేసీఆర్, జగన్ ల కుతంత్రాలు తోడయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నారని... ఆ కుట్రలు తెలిసే ఓటింగ్ కు తరలి రావాలని ప్రజలకు తాను పిలుపునిచ్చానని చెప్పారు. ముహూర్తాలు, ప్రమాణాలు, మంత్రి పదవులు అంటూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని అన్నారు. టీడీపీ విజయంపై సందేహం లేదని.. ఆధిక్యత ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని చెప్పారు.